

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు తిరిగి పుంజుకున్నప్పటికీ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గణనీయంగా బలపడటం కష్టమేనని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఫార్వర్డ్ మార్కెట్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) భారీ నికర డాలర్ షార్ట్ పొజిషన్ కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. 2026 సెప్టెంబరు నాటికి ఆర్‌బీఐ ఫార్వర్డ్ బుక్‌లో నికర డాలర్ షార్ట్ పొజిషన్ 239 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. బై-సెల్ స్వాప్స్ గడువు ముగిసినప్పుడు ఆర్‌బీఐ తిరిగి మార్కెట్‌కు డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని, ఇందుకోసం కొత్తగా వచ్చే పెట్టుబడుల నుంచి డాలర్లను సమీకరించాల్సి రావచ్చని పేర్కొంది. మొత్తం 239 బిలియన్ డాలర్లలో 40 బిలియన్ డాలర్లు ఏడాదిలోపు, 56 బిలియన్ డాలర్లు ఒకటి నుంచి మూడేళ్లలో, మరో 143 బిలియన్ డాలర్లు మూడు నుంచి ఐదేళ్లలో చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. చివరి మొత్తం ప్రధానంగా ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ డిపాజిట్ పథకంతో ముడిపడి ఉందని తెలిపింది.
మరోవైపు, అమెరికా ట్రెజరీ బాండ్లపై అధిక రాబడులు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అమెరికా నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా మధ్యకాలంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని నివేదిక అంచనా వేసింది. 2026 డిసెంబరు నాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.92-94 స్థాయికి, 2027 మార్చి నాటికి రూ.94-95 స్థాయికి చేరవచ్చని పేర్కొంది. 2027 జూన్ నాటికి డాలర్ విలువ రూ.96కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ డిసెంబరు, ఫిబ్రవరి సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు పెంచవచ్చని అభిప్రాయపడింది. అవసరమైతే ఏప్రిల్‌లో మరో 0.25 శాతం మేర పెంపు చేపట్టే అవకాశముందని నివేదిక పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!