

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కేసులో బాధితుడికి అనుకూలంగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న కీసర ఎస్సై కె. శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే పోలీస్‌స్టేషన్‌లో సెప్టెంబరు 17న రేషన్ బియ్యం కేసులో లంచం తీసుకుంటూ సీఐ, ఎస్సై పట్టుబడిన ఘటన మరువకముందే మరో ఉదంతం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఏసీబీ డీసీపీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడిపై చీటింగ్ కేసుతోపాటు, అతని సోదరుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నానికి సంబంధించిన మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో ఒకదానిలో అతడిని అరెస్టు చేయగా, మరో కేసులో నోటీసు జారీ చేసి కొన్ని అదనపు సెక్షన్లు చేర్చిన అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆ కేసులో అతడికి బెయిల్ లభించింది. అయితే, హాజరు కోసం ప్రతి సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌కు రావాల్సి ఉండేది.
గత సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సమయంలో ఛార్జ్‌షీట్‌ను త్వరగా, తనకు అనుకూలంగా దాఖలు చేయాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని ఎస్సై శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అంత మొత్తం చెల్లించలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. సోమవారం ఉదయం డబ్బులు తీసుకురావాలని ఎస్సై పలుమార్లు ఫోన్ చేసి కోరినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నాగారంలోని శిల్పానగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో బాధితుడి నుంచి కవర్‌లో రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. విచారణ పూర్తయిన తర్వాత మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామని డీసీపీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!