

కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్నది ప్రజాపాలన కాదని, దుర్మార్గపు పాలన అని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో భారాస కార్యకర్త మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా సోమవారం పరిగి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, ఇతర భారాస నాయకులతో కలిసి నరేందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటమి పాలవుతారన్న నివేదిక అందడంతోనే మూడు రోజుల పాటు మహిళా సభ, రైతు సభల పేరుతో రూ.150 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని నరేందర్‌రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలో రైతులకు సన్నధాన్యం బోనస్ ఇంకా చెల్లించలేదని విమర్శించారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నరేందర్‌రెడ్డి కొడంగల్‌కు వెళ్తుంటే ముఖ్యమంత్రికి భయమెందుకని ప్రశ్నించారు. పోలీసుల అడ్డంకులపై భారాస నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!