

ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సోమవారం దావోస్‌కు వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి, సోమవారం తెల్లవారుజామున 1.45 గంటలకు జ్యూరిక్ చేరుకుంటారు. తొలి రోజు స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో పాటు ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహాధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో సమావేశమవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని, జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటారు.
దావోస్ పర్యటనలో సీఎం యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీతో భేటీ అవుతారు. ‘ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్’, ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్, బ్లూమ్‌బర్గ్ నిర్వహించే గ్లోబల్ ఏఐ ఎకానమీ సెషన్లలో ముఖ్యంగా పాల్గొంటారు. ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఎన్విడియా, మోలర్ మేర్క్స్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొనే సీఎం, 22న దావోస్ నుంచి బయలుదేరి 23న ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!