

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదని, కేవలం అవసరమైన క్లియరెన్స్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. గతంలో తనకు కూడా విదేశీ పర్యటనలకు క్లియరెన్స్ రాని సందర్భాలు ఉన్నాయని, ఇది కొత్త సంప్రదాయం కాదని పేర్కొన్నారు. రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు పెట్టడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే సంబంధిత పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందినదని, దాని కింద తెలంగాణకు బియ్యం సరఫరా అవుతున్నాయని తెలిపారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని ఆయన గుర్తుచేశారు.
పేదలకు సన్నబియ్యం అందించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంపిణీ చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర పథకం కింద బియ్యం పంపిణీ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టకపోవడం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్న చర్యగా ఆయన ఆరోపించారు. రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ పేరు కూడా ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే, కేంద్రం నేరుగా బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే పొదుపు సంఘాల ద్వారా ఐదు కిలోల బియ్యాన్ని కేంద్రం తరఫున పంపిణీ చేయిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!