

విలక్షణ నటనతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని త్వరలో ‘కొక్కోరోకో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో యువ నటి మనస్విని బాలబొమ్మల కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆర్వీ ఫిల్మ్ హౌస్ బ్యానర్‌ను స్థాపించి తొలిసారి నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని రమేష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
‘కొక్కోరోకో’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు కోళ్లు పందెంలో పోరాడుతున్న ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కోడిపందేల నేపథ్యంలో ఐదు విభిన్న పాత్రల చుట్టూ సాగే ఈ ఆంథాలజీ చిత్రం పండుగ వాతావరణానికి తగ్గట్టుగా సరికొత్త అనుభూతిని అందించనుందని చిత్రబృందం తెలిపింది. నీలాద్రి ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఇతర చిత్రాలకు గట్టి పోటీ ఇస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!