

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆ దేశ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ తెలిపారు. ట్రైబ్యునల్ దోషిగా నిర్ధారించిన హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరుతూ న్యూదిల్లీకి ఇప్పటికే పలుమార్లు అధికారికంగా లేఖలు పంపినట్లు వెల్లడించారు. అయినప్పటికీ భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రజల దృష్టిలో హసీనా ఒక నేరస్థురాలని, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
హసీనాను ఎప్పటికైనా బంగ్లాదేశ్‌కు తీసుకొచ్చి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అసదుజ్జమాన్ స్పష్టం చేశారు. అయితే ఆమె ప్రస్తుతం మరో దేశంలో ఉన్నందున అప్పగింత ప్రక్రియను న్యాయశాఖ నేరుగా పర్యవేక్షించదని, ఈ బాధ్యత హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని వివరించారు. ఒకవేళ భారత్ ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తే ఎలాంటి భావోద్వేగాలకు, ఇతర ప్రభావాలకు తావులేకుండా చట్టపరమైన నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని తెలిపారు. హసీనాను తిరిగి రప్పించే క్రమంలో ఎలాంటి చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించబోమని మంత్రి స్పష్టం చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!