

భారత్‌లోని పలు నగరాలు తమ చరిత్ర, సంస్కృతి, ప్రత్యేకతలను ప్రతిబింబించే పేర్లతో ప్రసిద్ధి చెందాయి. జైపూర్‌ను పింక్ సిటీగా, ఉదయ్‌పూర్‌ను సిటీ ఆఫ్ లేక్స్‌గా, ముంబయిని కలల నగరంగా పిలుస్తారు. ఇదే విధంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు ‘లండన్ ఆఫ్ ఇండియా’ అనే గుర్తింపు ఉంది. గతంలో కలకత్తాగా పిలిచిన ఈ నగరం బ్రిటిష్ పాలనలో అనేక దశాబ్దాల పాటు భారతదేశ రాజధానిగా కొనసాగింది. ఆ సమయంలో పరిపాలన, వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన భారీ భవనాలు, విశాలమైన రహదారులు, న్యాయస్థానాలు, విద్యాసంస్థలు నగరానికి ప్రత్యేకమైన యూరోపియన్ రూపాన్ని తీసుకొచ్చాయి. నేటికీ అక్కడ కనిపించే అనేక పురాతన కట్టడాలు కోల్‌కతా వలస పాలన కాలం నాటి చరిత్రను గుర్తు చేస్తుంటాయి.
18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన పరిపాలనా, వాణిజ్య కేంద్రాన్ని కోల్‌కతాలో ఏర్పాటు చేయడంతో నగర అభివృద్ధి వేగం పుంజుకుంది. అనంతరం బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా మారడంతో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సంస్థల నిర్మాణానికి పెద్దపీట వేశారు. లండన్‌కు థేమ్స్ నది ఎలాగో, కోల్‌కతాకు హుగ్లీ నది అలాంటి ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ నది ద్వారా నౌకాయానం, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన ట్రామ్ రవాణా వ్యవస్థ కూడా కోల్‌కతాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. దేశంలోని అనేక నగరాల్లో ట్రామ్‌లు కనుమరుగైనప్పటికీ, కోల్‌కతాలో ఇప్పటికీ ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చారిత్రక కట్టడాలు, పాత రవాణా వ్యవస్థలను కాపాడుకుంటూనే మరోవైపు ఆధునిక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలతో నగరం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!