

మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) వర్గాల విలీనంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ రెండు వర్గాల మధ్య విలీన ప్రక్రియ తుది దశకు చేరినట్లు కనిపిస్తోందని మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు సంజయ్ షిర్సాత్ నవంబర్ 8న వ్యాఖ్యానించారు. త్వరలోనే పలువురు నేతల పాత్రలు, బాధ్యతలపై స్పష్టత వస్తుందని అన్నారు. దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని గతంలోనే చెప్పానని, ప్రస్తుతం అవి జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఏ పార్టీ మరో పార్టీలో విలీనమవుతుందో వేచి చూడాలని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఇరు వర్గాల నేతల మధ్య జరిగిన వరుస భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని ఆసుపత్రిలో శరద్ పవార్‌ను కలవగా, దివంగత అజిత్ పవార్ కుమారుడు, ఎన్సీపీ నేత పార్థ్ పవార్ నవంబర్ 7న దక్షిణ ముంబైలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 2023లో అజిత్ పవార్ తన వర్గం నేతలతో కలిసి BJP నేతృత్వంలోని ఎన్డీఏలో చేరడంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అనంతరం అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తు లభించగా.. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (SP)గా కొనసాగుతోంది. అజిత్ పవార్ జీవించి ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెండు వర్గాల విలీనం జరిగి ఉండేదని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే గతంలో వెల్లడించారు. అయితే అక్టోబర్ 26న ఎన్సీపీ వర్గం విలీనం ఉండదని స్పష్టం చేయగా, సెప్టెంబర్‌లో శరద్ పవార్ కూడా తమ పార్టీ స్వతంత్రంగానే కొనసాగుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో షిర్సాత్ తాజా వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తిని రేకెత్తించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!