

దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి అమ్మవారి ఖజానా (నాణేల) పంపిణీ ప్రారంభం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తుల రద్దీతో గుల్జార్ హౌస్ వరకు క్యూలైన్లు ఏర్పడ్డాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి ఖజానా పంపిణీ చేస్తున్నారు. పండుగ వేళ భక్తుల రాక పెరగడంతో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి ఖజానాలోని నాణెం లభిస్తే తమకు శుభం కలుగుతుందని, సిరిసంపదలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ నమ్మకంతోనే ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా అమ్మవారి ఖజానా కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని నాణేలను స్వీకరిస్తున్నారు. మూడు రోజుల పాటు ఖజానా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!