

ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం పాలైందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అంగీకరించారు. ఎన్నికల్లో కూటమి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూనే, తమ పార్టీ ఓటమి వాస్తవమని పేర్కొన్నారు. గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్రమాలకు పాల్పడ్డారన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. అందుకే ఇప్పుడు తమకు ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఇకపై ఎలాంటి ఎన్నికలు జరిగినా ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మద్యం రవాణా కేసులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈడీ విచారణ వివరాలను వెల్లడిస్తూ.. తన నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తంలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు ఇప్పించేందుకు సిఫారసు చేశానని అంబటి తెలిపారు. ఈ విషయంపై వాసుదేవరెడ్డితో మాట్లాడినట్లు, సంబంధిత వివరాలన్నింటినీ ఈడీ అధికారులకు వెల్లడించినట్లు చెప్పారు. తన సిఫారసుతో కాంట్రాక్టులు పొందిన వారు ఐదేళ్లపాటు వాటిని నిర్వహించగా, రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు టర్నోవర్ నమోదైందని వివరించారు. ఈ వ్యవహారంలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, అందులో భాగంగానే తనను విచారించినట్లు పేర్కొన్నారు. విచారణ సమయంలో అధికారులు తన ఆధార్, పాన్ కార్డులను తీసుకున్నారని అంబటి వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!