

అమెరికా 2026 మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ దాదాపు 474 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,000 కోట్లకు పైగా) ఖర్చు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, ముఖ్యంగా టెక్సాస్‌లో పార్టీ అభ్యర్థుల విజయానికి మస్క్ భారీగా నిధులు వెచ్చించారు. అయితే, ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్‌లలో ఆధిక్యం సాధించడంతో మస్క్ రాజకీయ వ్యూహానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టెక్సాస్‌లోనూ డెమొక్రాట్ అభ్యర్థి గినా హినోజోసా గవర్నర్‌గా గెలిచి, మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన రిపబ్లికన్ ఆధిపత్యానికి ముగింపు పలికారు.
డెమొక్రాట్లు అధికారంలోకి రావడంతో మస్క్ వ్యాపార సంస్థలపై విచారణలు జరిగే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పేస్‌ఎక్స్‌కు లభిస్తున్న ప్రభుత్వ కాంట్రాక్టులు, సబ్సిడీలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)లో ఆయన పాత్ర, ఉద్యోగుల తొలగింపులు వంటి అంశాలపై గతంలోనే డెమొక్రాట్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మస్క్ రాజకీయ ప్రభావం, ఆయన వ్యాపార ప్రయోజనాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మస్క్ ఎక్స్‌లో వ్యంగ్యంగా స్పందిస్తూ పోస్టులు పెట్టారు. దాదాపు అర బిలియన్ డాలర్ల ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడం ఆయన రాజకీయ ప్రాబల్యంపై చర్చకు దారితీసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!