

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురైన పరాజయాన్ని భారత రాజకీయ పరిణామాలతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు వెల్లువెత్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రస్తావిస్తూ పలువురు మీమ్స్, సెటైరికల్ పోస్టులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఓ మీమ్ ‘ఎక్స్’లో వైరల్‌గా మారింది. అందులో ట్రంప్.. ‘‘బ్రో.. మాకు జ్ఞానేశ్‌ను ఇవ్వవా!’’ అని అడుగుతున్నట్లుగా చిత్రీకరించారు. భారత ప్రతిపక్షాలు చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణల నేపథ్యంలో జ్ఞానేశ్‌కుమార్ పేరును ప్రస్తావిస్తూ ఈ పోస్టులు వ్యంగ్యంగా సాగాయి.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు కూడా ఈ అంశంపై ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌నకు జ్ఞానేశ్‌కుమార్ అవసరమని కొందరు పేర్కొనగా, మరికొందరు ఆయనను అమెరికాకు పంపుతున్నట్లుగా ఊహాత్మక పోస్టులు పెట్టారు. జ్ఞానేశ్‌కుమార్ అమెరికా ఎన్నికల నిర్వహణపై అక్కడి అధికారులకు శిక్షణ ఇవ్వడానికి వెళ్తున్నారంటూ వ్యంగ్య కథనాలనూ పంచుకున్నారు. ఇవన్నీ రాజకీయ పరిణామాలపై చేసిన సెటైర్లు, మీమ్స్ మాత్రమే; నిజంగా ట్రంప్ జ్ఞానేశ్‌కుమార్‌ను కోరినట్లు లేదా ఆయన అమెరికాకు వెళ్లనున్నట్లు వచ్చిన అధికారిక సమాచారం కాదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!