

ముంబై విమానాశ్రయంలో టెర్మినల్-1 పునరాభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో, అక్కడి నుంచి నడిచే 14 అంతర్జాతీయ విమాన సర్వీసులను నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (MIAL) పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఈ మార్పు అమలైతే బహ్రెయిన్, దమ్మామ్, ఢాకా, దోహా, ఫుజైరా, జకార్తా, జెడ్డా, ఖాట్మండు, కువైట్, మదీనా, మస్కట్, రాస్ అల్ ఖైమా, రియాద్, షార్జా నగరాలకు వెళ్లే విమాన సర్వీసులు నవీ ముంబై నుంచి నడిచే అవకాశం ఉంది.
ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్, ఆకాసా ఎయిర్ సంస్థలు కూడా తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను నవీ ముంబైకి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముంబై విమానాశ్రయంలోని టెర్మినల్-1 పునరాభివృద్ధి పనులు 2027 ఏప్రిల్ నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఈ పనుల నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విమానాల తరలింపుపై తుది నిర్ణయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!