

అగ్నిపథ్ పథకం కింద నియమితులైన అగ్నివీర్ల సేవా కాలాన్ని పొడిగించే కీలక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఎన్ఎస్ రాజా సుబ్రమణి వెల్లడించారు. ఇప్పటివరకు నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో 25 శాతం మందిని ప్రతిభ ఆధారంగా త్రివిధ దళాల్లో కొనసాగిస్తుండగా, మిగిలిన వారికి కూడా అవకాశం కల్పించేలా కొత్త విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీని ప్రకారం నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అగ్నివీర్లకు తొలుత మరో రెండేళ్ల పొడిగింపు ఇవ్వనున్నారు. అనంతరం ఆసక్తి, అర్హత, శారీరక సామర్థ్యం, క్రమశిక్షణ, విధి నిర్వహణలో ప్రతిభ ఆధారంగా సైన్యంలో కొనసాగేందుకు అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. ఈ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో త్వరలో సర్వీసు ముగియనున్న సుమారు 18 వేల మంది అగ్నివీర్లకు ప్రయోజనం కలగనుందని సమాచారం. ప్రస్తుతం దాదాపు మూడు లక్షల మంది అగ్నివీర్లు త్రివిధ దళాల్లో సేవలందిస్తున్నారు.
కొత్త విధానంలో రెండేళ్ల పొడిగింపు సమయంలో అగ్నివీర్లకు మొదటి ఏడాది నెలకు రూ.43,500, రెండో ఏడాది నెలకు రూ.47,500 వేతనం అందించనున్నట్లు సీడీఎస్ తెలిపారు. సేవా నిధి పథకం కింద కేంద్రం అదనపు మొత్తాన్ని జమ చేయనుందని, రెండేళ్ల పొడిగింపు పూర్తయ్యే సమయానికి సుమారు రూ.10.92 లక్షల నిధి సమకూరుతుందని వివరించారు. ఆరేళ్ల తర్వాత సైన్యం నుంచి వైదొలగాలనుకునే వారికి కూడా గణనీయమైన మొత్తంలో సేవా నిధి అందుతుందని పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకం కొనసాగుతుందని, దానిని రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కేంద్ర క్యాబినెట్ మరో నాలుగు పథకాలకు రూ.25,473 కోట్ల మేర ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బాలలపై లైంగిక నేరాల కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల సంఖ్యను 779 నుంచి 850కి పెంచి, వాటి గడువును 2031 మార్చి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.3,788 కోట్లు కేటాయించనున్నారు. కీలక ఖనిజాల ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధన నిల్వ సామర్థ్యం పెంపు, దేశ గణాంక వ్యవస్థ బలోపేతానికి కూడా నిధులు కేటాయించినట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!