

తెదేపా కోసం ఎన్నో మంది కార్యకర్తలు త్యాగాలు చేశారని, కొందరు తమ ఆస్తులు కూడా కోల్పోయారని ఆ పార్టీ అధినేత, సీఎం N. చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయాలే కాకుండా సంక్షోభాలు, సవాళ్లను కూడా పార్టీ ఎదుర్కొన్నదని ఆయన చెప్పారు. ఎలాంటి కుట్రలు జరిగినా పార్టీని బలహీనపరచలేకపోయారని స్పష్టం చేశారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమర్థంగా పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని, వారి కృషిని ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. ప్రతి ఎన్నికలో పార్టీ విజయం సాధించేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగాలని, రాజకీయాల్లో అస్థిరత వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారని, అది పార్టీ పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. పెట్టుబడుల పరంగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవంతో ఏర్పడిన ఈ పార్టీ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. సాధారణ ప్రజలను చట్టసభలకు తీసుకువచ్చిన పార్టీ ఇదేనన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చామని గుర్తు చేశారు.
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కష్టపడి పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడారు. కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ పట్ల నిబద్ధత చూపారని అన్నారు. వారికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!