

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో మరోసారి అసంతృప్తి స్వరం వినిపించింది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని, ఆ పదవిపై తనకు ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశారు. కూటమి నేతలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాననే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఉన్న పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. తన తమ్ముళ్ల కుమారులు ఇప్పటికే రాజీనామాలకు సిద్ధమయ్యారని వెల్లడించారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో సమావేశమైనప్పటికీ తమకు సంతృప్తి కలగలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి వచ్చే సమాచారం, అక్కడి పరిణామాలను బట్టి తన తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో ఏపీ కూటమిలో నెలకొన్న రాజకీయ విభేదాలపై చర్చ మొదలైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!