

ఓటీటీ వేదికలపై విభిన్న జానర్లలో సినిమాలు, సిరీస్‌లు వస్తున్న నేపథ్యంలో మరో కొత్త మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘జగమే సంగీతం’ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను సుస్మిత కొణిదెల నిర్మించారు.
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ‘జగమే సంగీతం’ హిందీలో తెరకెక్కిన ‘బండిష్ బాండిట్స్’ స్ఫూర్తితో రూపొందింది. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా కర్ణాటక సంగీతం, కుటుంబ వారసత్వం నేపథ్యంలో కథను తెరకెక్కించారు. సంగీత కుటుంబానికి చెందిన ఓ యువకుడు తన కుటుంబ సంప్రదాయాలను కొనసాగిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం, ఆధునిక సంగీతంపై ఆసక్తి ఉన్న యువతరం మధ్య జరిగే సంఘర్షణను కూడా ట్రైలర్‌లో చూపించారు. కుటుంబ బంధాలు, సంగీతం, సంప్రదాయం, వ్యక్తిగత ఆశయాలను కలిపి కథను ఆసక్తికరంగా రూపొందించినట్లు తెలుస్తోంది.
అక్షయ్ లగుసాని, సుస్మిత శెట్టి, సుమన్, షఫీ, ఝాన్సీ తదితరులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కు సంగీతం అందించారు. ‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సంగీత నేపథ్యంతో వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!