

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంగా ఉపయోగించిన ‘షీష్ మహల్’ను ఢిల్లీ ప్రభుత్వం మీడియా సందర్శనకు తెరిచింది. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న ఈ బంగ్లాలో కేజ్రీవాల్ 2015 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నివసించారు. ఈ నివాసం నిర్మాణం, పునరుద్ధరణ, ఇంటీరియర్స్ కోసం చేసిన ఖర్చుపై గతంలో రాజకీయ వివాదం చెలరేగింది. ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేశారంటూ బీజేపీ ఆరోపణలు చేయగా, ఇప్పుడు ఆ బంగ్లాలోని ఫర్నిచర్, అలంకరణ వస్తువులు, ఇతర సౌకర్యాల వివరాలను ప్రజలకు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు కూడా సందర్శించే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మీడియా సందర్శన సందర్భంగా బంగ్లాలోని ఖరీదైన వస్తువుల వివరాలను అధికారులు ప్రదర్శించారు. అందులో రూ.11.56 లక్షల విలువైన షాండ్లియర్, రూ.5.47 లక్షల ఖరీదైన రెండు సీట్ల సోఫా, సుమారు రూ.30 లక్షల విలువైన టీవీ యూనిట్ ఉన్నాయి. బంగ్లా బయట ఏర్పాటు చేసిన బోర్డుపై మొత్తం వ్యయం రూ.58.83 కోట్లుగా పేర్కొన్నారు. ప్రజల సందర్శనకు ప్రవేశ రుసుము సుమారు రూ.20గా ఉండవచ్చని, వృద్ధులు, కళాశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రజల సందర్శన తేదీలు, తుది ప్రవేశ రుసుముపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పరిమిత కాలం పాటు ప్రజల సందర్శనకు అనుమతించిన తర్వాత, అధికారిక సమావేశాలు, సదస్సులు, ఇతర కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ భవనాన్ని ప్రైవేట్ హాస్పిటాలిటీ సంస్థకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!