

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుఖేష్ చంద్రశేఖర్ బహుకోట్ల మోసం కథ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుఖేష్ చంద్రశేఖర్ స్టోరీ’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ కొత్త ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని అధికారికంగా ప్రకటించింది. ఇండియా టుడే ఒరిజినల్స్ నిర్మిస్తున్న ఈ డాక్యుమెంటరీకి మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ డిసెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. బెంగళూరులో సాధారణ స్థాయి నుంచి ప్రారంభమైన సుఖేష్ ప్రయాణం, దేశంలోనే అత్యంత చర్చనీయాంశమైన మోసగాళ్లలో ఒకరిగా ఎదిగే వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఇందులో చూపించనున్నట్లు సమాచారం.
రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులతో సుఖేష్‌కు ఉన్నట్లు చెప్పబడుతున్న సంబంధాలు, వివిధ పేర్లతో వ్యక్తులను నమ్మించి మోసం చేసిన తీరు వంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో వివరించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల పాటు లోతైన పరిశోధన జరిపిన చిత్ర బృందం, వార్తల్లో వచ్చిన అంశాలకే పరిమితం కాకుండా తెరవెనుక జరిగిన పరిణామాలను కూడా వెలుగులోకి తీసుకురానున్నట్లు సమాచారం. తీహార్ జైలులో ఉన్న సమయంలోనూ సుఖేష్ తన మోసాల వ్యవహారాలను ఎలా కొనసాగించాడనే ఆరోపణలు, వ్యవస్థలోని లోపాలు అతడికి ఎలా అనుకూలించాయనే అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. గతంలో నెట్‌ఫ్లిక్స్ కోసం ‘కర్రీ అండ్ సైనైడ్’, ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ’ వంటి డాక్యుమెంటరీలను రూపొందించిన బృందం ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!