

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జ్‌పై నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, మానవహారాలు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్ఐవీ మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని, సరైన చికిత్స లేకపోతే అది ఎయిడ్స్‌గా మారుతుందని చెప్పారు. రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి ద్వారా ఇది వ్యాపిస్తుందని, కానీ చేతులు కలపడం, ఆలింగనం చేయడం, కలిసి భోజనం చేయడం ద్వారా వ్యాపించదని స్పష్టం చేశారు. అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
హెచ్ఐవీ బాధితులను గౌరవంగా చూడాలని, వారికి సమాన హక్కులు కల్పించాలని మంత్రి సూచించారు. హెచ్ఐవీ & ఎయిడ్స్ (నివారణ మరియు నియంత్రణ) చట్టం 2017 ప్రకారం వివక్ష చూపడం నేరమని తెలిపారు. ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి ప్రాణాంతకమేమీ కాదని, దీర్ఘకాలం సాధారణ జీవితం గడపవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఉచిత పరీక్షలు, చికిత్స, మందులు అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 హెచ్ఐవీ చికిత్స సెంటర్ల ద్వారా 1.14 లక్షల మందికి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ముఖ్యంగా ఇంజక్షన్ల ద్వారా తీసుకునే మత్తు పదార్థాలు హెచ్ఐవీ వ్యాప్తికి కారణమవుతాయని హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఉంటే కుటుంబం, సమాజం, రాష్ట్రం బలపడుతాయని చెప్పారు.






.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!