

గృహహింస, దాడులు, వేధింపులకు గురైన మహిళలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక పరిష్కార కేంద్రాల (ఓఎస్సీ) పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేంద్రాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఒక మహిళ హింస నుంచి బయటపడి సహాయం కోసం ఓఎస్సీని ఆశ్రయించినప్పుడు సరైన సేవలు అందకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సిబ్బంది కొరత, ఇతర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహిళల భద్రత ఓ పథకం కాకుండా ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల్లో చాలా తక్కువ మొత్తమే ఓఎస్సీలకు వినియోగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ, ప్రభుత్వ వైఖరిపై వివరణ కోరారు. దీనికి స్పందించిన కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రీ ఠాకుర్, ఓఎస్సీలు ‘మిషన్ శక్తి’లో భాగంగా పనిచేస్తున్నాయని తెలిపారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు సుమారు 13.37 లక్షల మహిళలకు ఈ కేంద్రాల ద్వారా సహాయం అందించామని పేర్కొన్నారు. అలాగే, ఈ కేంద్రాల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!