

ఇరాన్‌కు వ్యతిరేకంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఆఫ్రికా దేశాల ఆర్థిక వ్యవస్థల పై ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరలు పెరుగుతుండటంతో ఇప్పటికే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న అనేక ఆఫ్రికన్ దేశాలు మరింత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
విశ్లేషకుల ప్రకారం ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలు చమురు దిగుమతుల పై ఆధారపడి ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల చమురు రవాణా అంతరాయం ఏర్పడితే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడం, స్థానిక కరెన్సీల విలువ తగ్గడం వంటి పరిణామాలు కనిపించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
దిగుమతులపై ఆధారపడే కెన్యా, ఘనా వంటి దేశాలు ఈ పరిస్థితి వల్ల ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. 2022 లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా కరెన్సీ విలువలు పడిపోవడంతో చమురు రవాణా వ్యయం సుమారు 25 శాతం పెరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
కెన్యా, ఉగాండా దేశాలు ప్రస్తుతం తమ చమురు సరఫరా వ్యవస్థలకు పెద్దగా అంతరాయం లేదని చెబుతున్నాయి. అయితే నైజీరియా, ఘనా వంటి దేశాలు ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ధరలు పెరిగినా వాటికి పెద్దగా లాభం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇటీవల చమురు ధర బ్యారెల్‌కు సుమారు 100 డాలర్లకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే అంగోలా, అల్జీరియా, లిబియా వంటి చమురు ఎగుమతి దేశాలకు ఆదాయం పెరిగే అవకాశముంది. అయితే చాలా ఆఫ్రికా దేశాలకు చమురు ధరల పెరుగుదల పెద్ద భారంగా మారే ప్రమాదం ఉంది.
ఆఫ్రికాలో ఎక్కువగా సరుకులు, ఆహార పదార్థాలు రోడ్డు రవాణాపైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. దీనివల్ల సాధారణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. చమురు దిగుమతుల కోసం అధిక విదేశీ మారకం ఖర్చు చేయాల్సి రావడం వల్ల కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సూడాన్, గాంబియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లెసోథో, జింబాబ్వే వంటి దేశాలు ఈ సమస్యకు ఎక్కువగా గురయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు.







.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!