

సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఇది తెలంగాణ గుండె చప్పుడుగా, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం మేడారంలో జాతర ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం, అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలిపారు.

సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా శాశ్వత నిర్మాణాలతో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 260 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అందులో 150 కోట్లు జాతర నిర్వహణకు, 110 కోట్లు శాశ్వత ఆలయ నిర్మాణాలకు కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈ నెల 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర పూర్తయ్యే వరకు ఆరోగ్య, విద్యుత్ శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!