

టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట ఆనందోత్సవం మొదలైంది. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్ వివాహం జరగనుండటం టెండూల్కర్ కుటుంబంలో ఆనందాన్ని నింపింది. ఈ పెళ్లి వేడుకను మార్చి 5న ముంబయిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పెళ్లి పనులు జోరుగా సాగుతుండగా, సచిన్ కుటుంబం స్వయంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా సచిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లిన సచిన్, అర్జున్–సానియా వివాహ ఆహ్వాన పత్రికను మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా చందోక్ కుటుంబ సభ్యులు కూడా సచిన్ కుటుంబంతో పాటు ఉన్నారు. సచిన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరిస్తూ, కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరు కుటుంబాలతో కలిసి ఫొటోలు దిగారు. అర్జున్, సానియా ప్రధానితో కలిసి ప్రత్యేకంగా ఫొటోలు దిగడం విశేషంగా మారగా, ఈ ఫొటోలను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా సచిన్ వివాహ ఆహ్వానం అందజేశారు.

వధువు సానియా చందోక్ ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు కాగా, ప్రఖ్యాత వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. కుటుంబ నేపథ్యంతో పాటు, ఆమె స్వయంగా కూడా వ్యాపార రంగంలో రాణిస్తూ ‘మిస్టర్ పాస్ పెట్ స్పా’ అనే పెట్ కేర్ సంస్థను నిర్వహిస్తోంది. సానియా చాలా ఏళ్లుగా సచిన్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ, సారా టెండూల్కర్‌తో మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ అనుబంధం క్రమంగా వివాహ బంధంగా మారడం విశేషం. అర్జున్ టెండూల్కర్ కూడా తన తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని, దేశీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో ఆడుతూ తనకంటూ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా టెండూల్కర్ కుటుంబంలో జరగనున్న ఈ వివాహ వేడుకపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, క్రీడా, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హాజరవుతారని సమాచారం. అర్జున్–సానియా జంటకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కొత్త జీవితం ఆనందం, విజయాలతో సాగాలని కోరుకుంటున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!