

హెచ్1బీ, హెచ్ 4 వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ప్రభుత్వం పరిశీలించే ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఈ నెల 15 వ తేదీ నుంచి వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ కార్యకలాపాలను సమీక్షిస్తామని అమెరికా విదేశాంగశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం హెచ్1బీ, హెచ్4 తో పాటు ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసే వారు తమ సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని సూచించారు. ఎఫ్, ఎం, జే వీసాలకు ప్రధానంగా విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు దరఖాస్తు చేస్తుంటారు.
ఈ వెట్టింగ్ ప్రక్రియ కారణంగా ఇప్పటికే కొన్ని హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు సమాచారం. వీసా జారీ విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
వీసా దరఖాస్తుదారులందరినీ జాతీయ భద్రత కోణంలో పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అమెరికాలోకి ప్రవేశించే వారు దేశ భద్రతకు లేదా పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించరని నిర్ధారించుకోవడమే ఈ చర్యల ఉద్దేశమని పేర్కొన్నారు. అందుకే వీసా దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను స్పష్టంగా చూపించాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!