

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగుతున్నారు. వారానికి ఐదు రోజుల పని వారం (ఫైవ్ డే వర్క్ వీక్) అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మె నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే జనవరి 25 ఆదివారం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు కూడా సమ్మె జరగడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఏర్పడింది.
సమ్మె ప్రభావంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు పూర్తిగా మూసివేయబడనున్నాయి. డిపాజిట్లు, నగదు ఉపసంహరణ, చెక్ లావాదేవీలు వంటి శాఖల సేవలు అందుబాటులో ఉండవు.
ప్రైవేట్ బ్యాంకులు పూర్తిగా మూసివేయకపోయినా, సిబ్బంది కొరత కారణంగా కొన్ని శాఖల్లో సేవలు పరిమితంగా మాత్రమే అందే అవకాశం ఉంది. అయితే నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే పనిచేస్తాయి. కానీ చెక్ క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్ వంటి ప్రక్రియలు ఆలస్యం కావచ్చని బ్యాంకు వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ఏటీఎంలలో నగదు రీలోడ్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది.
2015 నుంచి బ్యాంకు యూనియన్లు అన్ని శనివారాలకు సెలవులతో కూడిన ఐదు రోజుల పని వారం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇతర దేశాల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉండటంతో, భారతదేశంలో కూడా ఉద్యోగులకు మెరుగైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కల్పించాలని వారు కోరుతున్నారు. గతంలో జరిగిన చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతోనే ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఖాతాదారులు డిజిటల్ లావాదేవీల పై ఆధారపడాలని, శాఖల ద్వారా చేయాల్సిన పనులు ఆలస్యం కావచ్చని ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!