

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జెఎస్డబ్ల్యూ సిమెంట్స్ & పెయింట్స్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడపలో ప్రతిపాదిత జెఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన భూమిపూజ షెడ్యూల్‌పై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ప్రాజెక్టుల అమలులో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. జెఎస్డబ్ల్యూ – ఎల్జీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న బ్యాటరీ తయారీ యూనిట్‌కు శ్రీసిటీ లేదా విశాఖపట్నంను పరిశీలించాలని, ఎంజీ మోటార్ బ్రాండ్ ద్వారా ఈవీ మరియు ఐసీఈ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఏర్పాటుపై అవకాశాలు అన్వేషించాలని కోరారు. జెఎస్డబ్ల్యూ గ్రూప్ చేపడుతున్న హెరిటేజ్ అడాప్షన్ కార్యక్రమాల్లో భాగంగా గండికోట కోట, ఉండవల్లి గుహలు వంటి వారసత్వ ప్రదేశాలను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పార్త్ జిందాల్, ఎపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!