

హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రోరైలు తొలి దశ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సంస్థ కోరుతున్నప్పటికీ, భవిష్యత్తులో తలెత్తే ఆర్థిక, సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. ఎల్ అండ్ టీ నుంచి అవసరమైన హామీలు, పూచీకత్తులు తీసుకున్న తర్వాత మాత్రమే స్వాధీన ఒప్పందం అమలు చేస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఫ్రాన్స్‌కు చెందిన థేల్స్ సంస్థతో ఉన్న సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థల వివాదాలు పరిష్కారం కావడం ప్రధాన షరతుగా మారింది.
ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా ఎల్ అండ్ టీ, థేల్స్ మధ్య ఆర్థిక, సాంకేతిక విభేదాలు తలెత్తగా, వాటి బాధ్యత ప్రభుత్వంపై పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక హామీలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు నుంచి ప్రభుత్వానికి మెట్రో నిర్వహణ మార్పు జరగనున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మెట్రోరైలు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం కమిషనరేట్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం వాడుకలో ఉన్న పట్టాలు, కోచ్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉన్నాయని ధృవీకరణ పొందిన తర్వాతే స్వాధీన ప్రక్రియ పూర్తి కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!