

టాటా గ్రూప్‌కు చెందిన దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇంకా ఒక సంవత్సరం పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు అయినా, విశ్వసనీయ వర్గాలు దీనిని ధృవీకరించాయి. ఇటీవల టాటా గ్రూప్ యాజమాన్యం ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. 2022 జూలైలో బాధ్యతలు స్వీకరించిన ఆయన పదవీకాలం 2027 జూన్ వరకు ఉండాల్సి ఉంది. ఆయన నాయకత్వంలో ఎయిరిండియా–విస్తారా విలీనం జరిగినప్పటికీ, సేవల నాణ్యత, సమయపాలనలో ఆశించిన మెరుగుదల కనిపించలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. అదనంగా, గత ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తరువాత ఆయన నాయకత్వంపై మరింత విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఎయిరిండియా సీఈఓ పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియను టాటా గ్రూప్ ప్రారంభించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అమెరికా, యూకేకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థల అధిపతులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ కూడా ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ పరిణామాలు సంస్థలో పెద్ద స్థాయిలో మార్పులు జరుగుతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!