

సాంకేతిక రంగంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం ఎండాడ ప్రాంతంలో 20 ఎకరాల భూమి కేటాయింపునకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని సమాచారం. ఈ నెలలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. క్యాంపస్‌కు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులపై తుది చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్ విశాఖ ఐటీ హిల్స్‌లో తాత్కాలిక భవనంలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
దక్షిణ భారతదేశంలో ఇప్పటికే బెంగళూరు, మంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురంలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లు ఉన్నాయి. ఇప్పుడు విశాఖలో కూడా శాశ్వత క్యాంపస్ ఏర్పాటుతో దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో సంస్థ ఉనికిని సాధించినట్లవుతుంది. ఈ విషయంపై రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్‌తో చర్చలు ప్రారంభించింది.
ఇదే సమయంలో విశాఖలోకి ఇతర ఐటీ దిగ్గజ సంస్థలు అడుగుపెడుతున్నాయి. గూగుల్, రిలయన్స్, సిఫీ వంటి సంస్థలు భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోగా, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు తాత్కాలిక క్యాంపస్‌లతో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. “విశాఖ సిద్ధంగా ఉండు. ఈ నెలలో ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారు. వచ్చేది ఎవరో ఎవరైనా ఊహించగలరా” అంటూ మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ కూడా ఈ పరిణామాలపై ఆసక్తిని పెంచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!