

కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థి హత్యకు గురికావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టొరంటో నగరంలోని స్కార్‌బొరౌగ్ ప్రాంతంలో, విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పై భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందిస్తాం” అని తెలిపింది.
పోలీసుల వివరాల ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. University of Toronto లో చదువుతున్న శివాంక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. నిందితులు ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు.
దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాలతో కళాశాల క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల కెనడాలో మరో భారతీయ యువతి హిమాన్షీ ఖురానా హత్యకు గురైన ఘటన కూడా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసులో అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!