

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య, ఇరాన్ సరిహద్దులోని హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటి వచ్చిన భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘పైన్‌గ్యాస్’, ‘జగ్ వసంత్’ సురక్షితంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నౌకలకు సంబంధించిన వీడియోలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.
ఈ రెండు నౌకలు కలిపి దేశవ్యాప్తంగా ఒకరోజు అవసరానికి సరిపడే సుమారు 92,612 టన్నుల వంటగ్యాస్‌ను తీసుకొస్తున్నాయి. లారక్, ఖేశ్మ్ ద్వీపాల మార్గంగా ప్రయాణించిన ఈ నౌకల్లో ఒకదానిలో 33 మంది, మరొకదానిలో 22 మంది భారత నావికులు ఉన్నారు.
హర్మూజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన ఈ నౌకలు మార్చి 26 నుంచి 28 మధ్య భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ‘శివాలిక్’, ‘నందాదేవి’ వంటి గ్యాస్ నౌకలు దేశానికి చేరుకోగా, ఈ రెండు నౌకల రాకతో ఇంధన అవసరాలకు కొంత ఊరట లభించనుంది.
పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా ఉండేందుకు భారత్ చర్యలు చేపడుతోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిలిచిన మరికొన్ని ట్యాంకర్లను హర్మూజ్ జలసంధి దాటించేందుకు ఇరాన్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ చర్చలు విజయవంతమైతే, మరో ఆరు ట్యాంకర్లు భారత్‌కు చేరుకుని సుమారు 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, భారత నౌకలకు దీర్ఘకాలిక భద్రత హామీ లేకపోవడంతో ఇరాన్‌తో చర్చలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఇరాన్‌లోని అంతర్గత పరిస్థితుల కారణంగా నౌకల అనుమతుల విషయంలో ఐఆర్జీసీ నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. అయినప్పటికీ, తటస్థ దేశాల నౌకలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇరాన్ సహకార దృక్పథంతో వ్యవహరిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.







.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!