

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీని అమలు చేసిందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ ద్వారా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్‌పై 100 శాతం మినహాయింపు ఇవ్వడం వల్ల, పాలసీ ప్రారంభమైనప్పటి నుంచి 1,15,551 ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం రూ.925.94 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడానికి మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా సహా పలు కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. అలాగే సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఈవీ వాహనాలను పరిశీలించి వాటి వివరాలను తెలుసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగులు ఈవీ వాహనాలు వినియోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఈవీ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం 0.60 శాతం నుంచి 1.50 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈవీ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలు కూడా ఈవీలే ఉండేలా ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. అవసరమైతే హైర్ పద్ధతి లేదా విభాగాల ద్వారా ఈవీ వాహనాలను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.







.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!