

గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో భారత ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి ఉన్న విశిష్ట స్థానం గురించి ప్రస్తావించారు. 1950 నుంచి 60 వరకు హైదరాబాద్‌ను “నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్”గా పిలిచేవారని గుర్తు చేశారు. దేశంలోనే ఫుట్‌బాల్ ఆటను ఆదరించి అగ్రశ్రేణి క్రీడాకారులను అందించిన ఘనత హైదరాబాద్‌కే దక్కిందని తెలిపారు. అలాగే 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫుట్‌బాల్ జట్టులో ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్‌కు చెందినవారని చెప్పారు. హైదరాబాద్ పోలీస్ ఫుట్‌బాల్ జట్టుకూ దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని పేర్కొన్నారు. బీఎన్ మల్లిక్ ఒక స్పై మాస్టర్‌గా నిఘా వ్యవస్థను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని, ఆయన పేరుతో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో 34 జట్లు పాల్గొని అద్భుత క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాయని తెలిపారు. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన CISF జట్టుకు తాను ట్రోఫీ అందించినట్లు చెప్పారు.
యువత క్రమంగా క్రీడల నుంచి దూరమవుతున్నారని, క్రీడా మైదానాలను వదిలిపెట్టడం సరైన మార్గం కాదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రపంచ స్థాయిలో పరిశీలించినప్పుడు సౌత్ కొరియాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాల్లో అనేక బంగారు పతకాలను సాధించిందని ఉదాహరణగా చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇప్పటికీ ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో బంగారు పతకాలు సాధించలేకపోయిందని, కానీ 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా మాత్రం 30కి పైగా పతకాలు సాధించిందని వివరించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ యూనివర్సిటీలో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు బోర్డు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.
యువతను పబ్, డ్రగ్ కల్చర్ నుంచి క్రీడా మైదానాలవైపు తిరిగి తీసుకురావడం తన లక్ష్యమని సీఎం అన్నారు. మంచి చదువులు చదివిన యువత కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది ఆందోళనకరమని తెలిపారు. పంజాబ్ యువత డ్రగ్స్ ప్రభావానికి లోనైన ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆ పరిస్థితి తెలంగాణలో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. నేరాల తీరు మారిపోయిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్విముఖ ఆయుధంగా మారిందని, డ్రగ్స్ మరియు సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని నియంత్రించే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా క్రీడల్లో రాణించే యువతకు ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతి అందించినట్లు, అలాగే క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ప్రత్యేకంగా డీఎస్పీ ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. ఒలింపిక్స్‌లో రాణించిన దీప్తి జురాంజికి కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని పేర్కొంటూ, క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కొనసాగుతుందని అన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!