

‘‘ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేయకపోతే కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి? నా నట జీవితంలో కూడా అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నాను’’ అని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు అడివి శేష్‌తో కలిసి నటించిన ‘డెకాయిట్’ చిత్రంతో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ నెల 10న విడుదల కానున్న ఈ సినిమా సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్త నేపథ్యం, సవాళ్లతో కూడిన పాత్రలు తనను ఆకర్షిస్తాయని చెప్పారు. ‘డెకాయిట్’ యాక్షన్ ప్రధానంగా సాగే ప్రేమకథగా ఉంటుందని, ఇందులో తాను సరస్వతి పాత్రలో కనిపిస్తానని తెలిపారు. రోమియో-జూలియట్ తరహా ప్రేమకథ ఎలా డెకాయిట్స్‌గా మారుతుందనేది కథలో కీలకాంశమని వివరించారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరచే పాత్రలు చేయడం తనకు ఇష్టమని, ఈ సినిమాలో తనకే కొత్తగా అనిపించిన పాత్రను పోషించినట్లు చెప్పారు.
యాక్షన్, ప్రేమ కలయికతో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని మృణాల్ పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటించినప్పటికీ, అవి హీరో తరహా ఫైట్లు కాకుండా కార్ చేజింగ్ సన్నివేశాలుగా ఉంటాయని చెప్పారు. డ్రైవింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, సినిమాలో కూడా అనేక సన్నివేశాల్లో కార్ నడుపుతూ కనిపిస్తానని తెలిపారు. అడివి శేష్ ఈ చిత్రంలో తన కెరీర్‌లో కొత్త కోణంలో కనిపిస్తారని, ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించిందన్నారు. దర్శకుడు షానియోల్, నిర్మాత సుప్రియతో పాటు మొత్తం బృందం సమన్వయంతో ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. భాషల మధ్య ఉన్న గీతలను చెరిపేయడం తన లక్ష్యమని, తెలుగు, హిందీ, మరాఠీ వంటి భాషల్లో నటిస్తూ విభిన్న కథలను ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో సినిమాలను ఎంపిక చేసుకుంటున్నానని మృణాల్ వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!