మొయినాబాద్‌లో జరిగిన ఫామ్ హౌస్ పార్టీపై పోలీసులు చేసిన సోదాలు తెలంగాణలో పెద్ద చర్చకు దారి తీశాయి. రంగారెడ్డి జిల్లాలోని పంజుగుల ప్రాంతంలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో లగ్జరీ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి విదేశీ మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నయీముద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం పార్టీలో 10 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. తనిఖీల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆధారాలతో పాటు విదేశీ మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో కాల్పులు జరిగినట్లు కూడా పోలీసుల ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు మరింత సంచలనంగా మారింది. ఫామ్ హౌస్‌లో చేసిన తనిఖీల్లో జర్మనీకి చెందిన .32 రివాల్వర్, ఒక లైవ్ రౌండ్, నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రైవర్ సిల్వరి శరత్ కుమార్ వద్ద నుంచి 0.26 గ్రాముల కొకైన్ కూడా పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది పార్టీకి తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. పార్టీలో ఉన్నవారికి డ్రగ్ పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, మరెవరైనా ఇందులో ఉన్నారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!