

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25గా నమోదైంది. బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచారు, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు, వీరు 12,089 పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం, ఇది గత ఏడాది 72.8 శాతంతో పోలిస్తే మెరుగైన ఫలితం. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 96.07 శాతం ఉత్తీర్ణత నమోదవగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ఠంగా 57.02 శాతం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 2,161 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఫీజును వచ్చే నెల 1 నుంచి 9 వరకు చెల్లించవచ్చు, అలాగే రూ.50 ఆలస్య రుసుముతో వచ్చే నెల 10 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వచ్చే నెల 1 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!