

తెలంగాణలో మంగళవారం చేపట్టాలని భావించిన ఆటోల బంద్‌ను రద్దు చేసినట్లు స్టేట్ టాక్సీ అండ్ ఆటో యూనియన్ ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్య గౌడ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో బైక్ టాక్సీలను రద్దు చేయాలంటూ త్వరలోనే ప్రత్యేక ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. బైక్ టాక్సీల వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పేరుతో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం పడిందని యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ప్రస్తుతం బంద్‌ను రద్దు చేసినప్పటికీ, తమ డిమాండ్ల పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఆందోళనలు చేపడతామని యూనియన్ స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!