

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె. శాంతి అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సర్వీసులో చేరి ఆరేళ్లు కూడా పూర్తికాకముందే ఆమె ఆదాయానికి మించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాల్లో తేలింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడటంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు.
తనిఖీల్లో తాడేపల్లి, విశాఖపట్నంలో ఖరీదైన విల్లా, ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లు కూడా బయటపడింది. కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించగా, విజయవాడలోని బ్యాంకులో ఆమె పేరిట లాకర్ ఉన్నట్లు గుర్తించారు. కోర్టు అనుమతితో దానిని తెరిచి మరిన్ని వివరాలు వెలికితీయనున్నారు.
ఏసీబీ సోదాల్లో 700 గ్రాములకు పైగా బంగారం, దాదాపు 3 కిలోల వెండి, నగదు, బ్యాంకు డిపాజిట్లు, వాహనాలు, విలువైన గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ కాలంలోనే ఇంత భారీ ఆస్తులు కూడబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!