

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం హడ్కో నుంచి ఏపీ టిడ్కో తీసుకునే రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పిడుగురాళ్ల బోధనాసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించనుండగా, ప్రస్తుతం ఉన్న 330 పడకలను 420 పడకలకు పెంచేందుకు, అవసరమైన పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ వివరాలను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరులో కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు 33 ఎకరాల భూమి బదలాయింపు, అభివృద్ధి జరగని కారణంగా గార్డెన్‌సిటీ రియాలిటీకి ఇచ్చిన ఎల్ఓఐ రద్దు, గుంటూరు శిల్పారామంలో కల్చరల్ సెంటర్ అభివృద్ధికి అనుమతి లభించింది. అర్జున అవార్డు గ్రహీత యర్రాజి జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అన్నమయ్య జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాల ఉచిత భూకేటాయింపు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు అదనంగా రూ.11,850 కోట్ల రుణం, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.247.12 కోట్లతో రాయి తవ్వకాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో వాస్తు అభ్యంతరాలున్న 112 ప్లాట్లను రద్దు చేసి లాటరీ ద్వారా కొత్త ప్లాట్లు కేటాయించే అధికారాన్ని సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ తీర్మానం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!