

తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నేడే ఇద్దరు కీలక నిందితులను A16 అజయ్ కుమార్ సుగంధ్, A29 సుబ్రహ్మణ్యం కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 12 వరకు వీరిని మూడు రోజుల పాటు విచారించి, కేసుకు సంబంధించిన ముఖ్య అంశాల పై వారి స్టేట్మెంట్లను రికార్డు చేయాలని SIT నిర్ణయించింది.
ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 12 కు చేరుకోవడంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే జరిగిన ప్రాథమిక విచారణలో, భోలేబాబా డెయిరీ (Bholebaba Dairy)కు చెందిన అజయ్ కుమార్ సుగంధ్ పూర్తిగా రసాయనాలతో తయారుచేసిన నెయ్యినే టీటీడీకి సరఫరా చేసినట్లు, పాలు కొనుగోలు కూడా చేయలేదని స్పష్టమైంది.
ఇక మరో నిందితుడు, మాజీ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అర్హతలేని డెయిరీలకు టెండర్లు కట్టబెట్టేందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు SIT రిమాండ్ నివేదిక వెల్లడించింది. డెయిరీ యజమానుల నుంచి వెండి ప్లేట్, శాంసంగ్ ఫోన్, రూ.3.5 లక్షల నగదు వంటి బహుమతులు కూడా స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మైసూరు ల్యాబ్ నివేదికలో భోలేబాబా కంపెనీ నెయ్యి కల్తీగా తేలినా, ఆ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి సాంకేతిక కమిటీలో అనుకూల నివేదికలు ఇవ్వడంలో సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆయనను తిరుపతిలో అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!