

భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు సిద్ధమయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల నేపథ్యంలో చేపట్టనున్న ఈ విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 36 కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడి సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరపనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అవకాశాలపై చర్చలు జరగనున్నాయి. పర్యటనలో భాగంగా ఐబిఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మెర్క్స్ వంటి ప్రముఖ సంస్థల సీఈఓలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, నూతన ప్రాజెక్టులు, ఉపాధి సృష్టిపై విస్తృతంగా చర్చించనున్నారు.
అదేవిధంగా స్విట్జర్లాండ్, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. అంతర్జాతీయ సహకారం, వాణిజ్య భాగస్వామ్యాలపై చర్చలు జరిపి, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా నిలిపే దిశగా ప్రయత్నాలు చేయనున్నారు. ఈ నాలుగు రోజుల దావోస్ పర్యటన అనంతరం ఈ నెల 23 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!