
.jpg&w=3840&q=75)
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరుగాంచిన ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్గత సమస్యలు, సిబ్బంది కొరత, సాంకేతిక అంతరాయాలు అన్ని కలిసి సంస్థ కార్యకలాపాలను పెద్ద ఎత్తున దెబ్బతీశాయి.
డీజీసీఏ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజుల్లో ఇండిగో మొత్తం 1,232 విమాన సర్వీసులను రద్దు చేసింది. బుధవారం నాడు మాత్రమే సంస్థ నిర్వహించే మొత్తం ఫ్లైట్లలో కేవలం 35 విమానాలు మాత్రమే నడిచాయి. సిబ్బంది కొరత కారణంగా 755 సర్వీసులు, ఏటీసీ సంబంధిత సమస్యల వల్ల 92 సర్వీసులు నిలిచిపోయాయి.
ఈ పరిస్థితి పై స్పష్టమైన వివరణ ఇవ్వడానికి ఇండిగో యాజమాన్యాన్ని డీజీసీఏ స్వయంగా ప్రధాన కార్యాలయానికి రావాలని ఆదేశించింది.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై సహా పలు విమానాశ్రయాల్లో ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో వాగ్వాదాలు, గందరగోళం జరిగిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. "సాంకేతిక సమస్యలు, ఆపరేషనల్ చిక్కలు, విమానాశ్రయాల్లో పెరిగిన రద్దీ కారణంగా గత రెండు రోజులుగా మా సర్వీసుల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు. అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ సౌకర్యాలు, రీఫండ్లు అందిస్తున్నాం" అని సంస్థ పేర్కొంది.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మాత్రమే బుధవారం 40 సర్వీసులు రద్దయ్యాయి. శబరిమలకు వెళ్లేందుకు చేరుకున్న అయ్యప్ప భక్తులు విమానాలు రద్దు కావడంతో అసహనం వ్యక్తం చేశారు. గురువారం నాటి షెడ్యూల్లో కూడా ఇండిగో మరిన్ని 18 సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అదే సమయంలో, దేశంలోని అనేక విమానాశ్రయాల్లో చెక్-ఇన్ వ్యవస్థల్లో బుధవారం ఉదయం నుంచి అంతరాయాలు తలెత్తాయి. ఫ్లైట్ షెడ్యూల్లు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాశ్రయాలు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సమస్య వలన ఈ అంతరాయాలు వచ్చాయని ప్రకటించగా, మైక్రోసాఫ్ట్ దీనిని ఖండించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!