

నాయికలు ప్రధాన పాత్రల్లో నటించే వైవిధ్యమైన సినిమాలకు ప్రేక్షకుల మద్దతు తగ్గిపోవడంతో అవి కనుమరుగయ్యే దశలో ఉన్నాయని నటి తాప్సీ పేర్కొన్నారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అస్సీ’ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సినీ పరిశ్రమ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. పాత్ర కోసం కోర్టులకు వెళ్లి న్యాయవాదుల పనితీరును పరిశీలించానని, ముఖ్యంగా ఒక మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ భావోద్వేగాలకు లోనుకాకుండా కేసులను అధ్యయనం చేస్తున్న తీరు తన పాత్రను అర్థం చేసుకోవడంలో సహాయపడిందని చెప్పారు.
ఇలాంటి కథా ప్రధాన చిత్రాలు ఓటీటీలో తప్పకుండా వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నప్పటికీ, థియేటర్లలో విజయవంతమైన సినిమాలకే ఓటీటీలు ప్రాధాన్యం ఇస్తాయని తాప్సీ అన్నారు. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లలో అన్ని రకాల సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఒకే రకమైన సినిమాలు తీసి వాటి వైఫల్యానికి ప్రేక్షకుల్ని నిందించడం సరైంది కాదన్నారు. మహిళా కేంద్ర కథలకు కూడా ప్రేక్షకుల ఆదరణ అవసరమని, అప్పుడే విభిన్న కథలు తెరపై నిలుస్తాయని చెప్పారు. ఇతర కథానాయికల విజయాలు తనకు ఆనందాన్ని ఇస్తాయని పేర్కొంటూ ‘మర్దానీ 3’ విజయాన్ని ప్రత్యేకంగా అభినందించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!