

అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వెండితెరకు పరిచయమైన సుమంత్.. హీరో పాత్రలతో పాటు ప్రత్యేక పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. చిన్నతనంలో తన తల్లిదండ్రులు అమెరికా వెళ్లిన సమయంలో తాత అక్కినేని నాగేశ్వరరావు తనను దగ్గరికి తీసుకుని కొడుకులా చూసుకున్నారని సుమంత్ గుర్తుచేసుకున్నారు. మంచిచెడులు చెప్పడంతో పాటు చదువు, కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపారు. తాతగారి ప్రభావంతోనే సినిమాల్లోకి రావాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ తన తొలి సినిమా కాగా, ఆ తర్వాత ‘సత్యం’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. షూటింగ్ లేని సమయంలో వారానికి కనీసం రెండుసార్లు థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం తనకు ఇష్టమని, సాధారణ రోజుల్లో ముఖానికి మాస్క్ ధరించి మరీ మార్నింగ్ షోలకు వెళ్తానని వెల్లడించారు.
సినిమాలే తన ప్రపంచమని చెప్పిన సుమంత్.. కథలు నచ్చకపోవడంతోనే మధ్యమధ్యలో కెరీర్‌లో విరామాలు వచ్చాయని తెలిపారు. సినిమాలు చేసినా, చేయకపోయినా కథలు వింటూనే ఉంటానని, నచ్చిన కథను మాత్రమే ఎంచుకుంటానని చెప్పారు. తాను విని చేయకుండా వదులుకున్న ‘నువ్వే కావాలి’, ‘దేశముదురు’ చిత్రాలు విజయవంతం కావడం గురించి కూడా ప్రస్తావించారు. ‘సీతారామం’ తర్వాత సపోర్టింగ్ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే విలన్ పాత్రల్లోనూ నటిస్తానని చెప్పారు. తన మామ నాగార్జున కెరీర్ ప్రారంభంలో నటన, డైలాగ్ డెలివరీ విషయంలో సూచనలు ఇచ్చి ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. మహేశ్‌బాబు తనకు మంచి మిత్రుడని, ఆయన తన ఫేవరెట్ హీరో అని చెప్పారు. తాను ఇంట్రావర్ట్ కావడంతో సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇష్టం ఉండదని, సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటానని సుమంత్ వెల్లడించారు. ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!