

విడుదలై 25 ఏళ్లు పూర్తిచేసుకున్నా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ, మధురమైన పాటలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘నువ్వే కావాలి’ విజయం తర్వాత దర్శకుడు కె. విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్, నిర్మాత స్రవంతి రవికిషోర్ కలయికలో ఈ చిత్రం తెరకెక్కింది. తొలుత తరుణ్‌ను హీరోగా అనుకున్నప్పటికీ.. కథలో కామెడీ, ఎమోషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో వెంకటేశ్‌ను కథానాయకుడిగా ఎంపిక చేశారు. త్రిష, గజాలా పేర్లు హీరోయిన్గా వినిపించినప్పటికీ చివరకు ఆర్తి అగర్వాల్ అవకాశం దక్కించుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన తెరవెనుక విశేషాలు కూడా ఆసక్తికరమే. ప్రకాశ్‌రాజ్‌పై ఉన్న నిషేధం కారణంగా తొలుత ఆయన సన్నివేశాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసి, నిషేధం తొలగిన తర్వాత ఆయన పార్ట్‌ను చిత్రీకరించారు. వెంకటేశ్ సూచనతో వాటర్ వరల్డ్ కామెడీ సన్నివేశాలను జోడించగా, వాటికి మిస్టర్ బీన్ స్ఫూర్తిగా నిలిచారు. 85 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా నిడివి 3 గంటల 14 నిమిషాలు. వెంకటేశ్ పారితోషికం మినహాయిస్తే బడ్జెట్ సుమారు రూ.4.5 కోట్లు కాగా, ఆర్తి అగర్వాల్ పారితోషికం రూ.10 లక్షలు. న్యూజిలాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించిన సమయంలో వెంకటేశ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ‘ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని’ పాట కోసం సీతారామశాస్త్రి 60 పల్లవులు రాయగా, మొదట రాసిన పల్లవినే ఎంపిక చేశారు. సినిమా నిడివి తగ్గించాలన్న సూచనలు వచ్చినా నిర్మాత స్రవంతి రవికిషోర్ ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించలేదు. చివరకు ఈ చిత్రం ఘన విజయం సాధించి 93 కేంద్రాల్లో 50 రోజులు, 57 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమై అప్పట్లో రికార్డు సృష్టించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!