

వైవిధ్యమైన దర్శకత్వం, విలక్షణమైన నటన, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్‌జే సూర్య. నటుడు కావాలనే కలతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, తొలుత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. విజయ్‌తో తమిళంలో తెరకెక్కించిన ‘ఖుషి’ విజయవంతం కావడంతో పాటు, పవన్ కళ్యాణ్‌తో రూపొందించిన తెలుగు వెర్షన్ కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఆయనకు స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ‘న్యూ’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు భాగ్యరాజ్ వద్ద శిష్యుడిగా చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను కూడా సూర్య గుర్తుచేసుకున్నారు. తనను శిష్యుడిగా చేర్చుకోవాలని పట్టుబడుతూ ఒకసారి భాగ్యరాజ్ కారు ముందు నిలబడ్డానని తెలిపారు. అనంతరం వసంత్, సభాపతి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, అజిత్ కుమార్‌తో తెరకెక్కించిన ‘వాలి’ సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం తన కెరీర్‌కు బలమైన పునాది వేసిందని చెప్పారు.
తమిళనాడులోని వాసుదేవనల్లూరుకు చెందిన ఎస్‌జే సూర్య చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. పదో తరగతిలోనే ఇంట్లో లేఖ రాసి చెన్నైకి వెళ్లి సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు. డిగ్రీ పూర్తయినా సినిమా ప్రయత్నాలను కొనసాగించిన ఆయన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా హోటల్‌లో వెయిటర్‌గా కూడా పనిచేశారు. దాదాపు ఆరేళ్లపాటు అవకాశాల కోసం ఎదురుచూసిన తర్వాత, ముందుగా దర్శకుడిగా పేరు సంపాదించి, ఆ తర్వాత నటుడిగా తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘న్యూ’ సినిమా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినా, మహేశ్‌బాబు హీరోగా తెలుగులో తెరకెక్కించిన ‘నాని’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా సరిగా ఆడకపోవడం ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని, మహేశ్‌బాబుకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించాలని ఉందని సూర్య వెల్లడించారు. ప్రస్తుతం విభిన్న పాత్రల్లో, ముఖ్యంగా ప్రతినాయకుడిగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన, త్వరలో ‘జైలర్ 2’తో మరోసారి అలరించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!