

రాష్ట్రంలో కరువు, తుపాన్ల కారణంగా నష్టపోయిన ప్రజలకు విపత్తు నిర్వహణ నిధుల ద్వారా త్వరితగతిన సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సకాలంలో అండగా నిలవాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అందుబాటులో ఉన్న విపత్తు నిర్వహణ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, కేంద్రం నుంచి అదనపు ఆర్థిక సాయం పొందాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు, అర్ణవ్, మురాసు తుపాన్ల వల్ల రైతులకు జరిగిన నష్టాలు, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులపై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాలకు జరిగిన నష్టాలకు సంబంధించి SDRF నిబంధనల ప్రకారం రూ.2,459 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎల్‌నినో కరువు వల్ల వ్యవసాయ నష్టాలకు రూ.1,721 కోట్లు, అర్ణవ్ తుపాను నష్టాలకు రూ.602 కోట్లు, మురాసు తుపాను నష్టాలకు రూ.97 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు.
ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ప్రతి బాధిత రైతుకు పంటల బీమా పరిహారం కూడా అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. నష్టపోయిన రైతుల వివరాలను కచ్చితంగా సేకరించి, పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి అందుబాటులో ఉన్న నిధులను సమీకరించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఉద్యాన పంటల కోసం జీ-రామ్-జీ నిధుల వినియోగానికి ఇప్పటికే అనుమతి లభించిందని గుర్తుచేశారు. ప్రకృతి వ్యవసాయానికి కూడా ఈ నిధులను వినియోగించుకునేలా అవసరమైన అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!