

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. సింగీతం తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులని గుర్తుచేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో తాను ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’ వంటి మూడు విభిన్నమైన క్లాసిక్ చిత్రాల్లో నటించానని తెలిపారు. ఈ సినిమాల ద్వారా సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక వంటి విభిన్న జానర్లలో పాత్రలు పోషించే అవకాశం లభించిందని, ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేనని బాలకృష్ణ పేర్కొన్నారు.
‘మాయాబజార్’ చిత్రానికి దర్శకుడు కె.వి. రెడ్డి వద్ద సహాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారని బాలకృష్ణ తెలిపారు. అనంతరం తన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు నటించిన పలు చిత్రాలకు ఆయన అసోసియేట్‌గా పనిచేశారని గుర్తుచేశారు. 94 ఏళ్ల వయసు వరకు వివిధ భారతీయ భాషల్లో వినూత్న చిత్ర ప్రయోగాలు చేసిన సింగీతం అసలు సిసలు దిగ్గజ దర్శకుడని కొనియాడారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని, భారతీయ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!